Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం: అల్లు అర్జున్ వీడియో విడుదల

Allu Arjun announces rs 25 lakh to revanth family
  • రేవతి కుటుంబానికి తాము అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ
  • విషయం తెలియగానే తాము షాక్‌కు గురయ్యామన్న హీరో
  • ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్న అల్లు అర్జున్
  • ఈ విషాదం మాటల్లో చెప్పలేనిదని ఆవేదన
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకమైనదన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు.

మొన్న తాము సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను, దర్శకుడు సుకుమార్ సహా సినిమా టీం అంతా షాక్‌కు గురయ్యామన్నారు.

గత ఇరవై ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్‌కు వెళ్లి చూసి వస్తుంటానని... ఇప్పుడు ఇలా జరగడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమన్నారు. ఇది మాటల్లో చెప్పలేనిదన్నారు. 

మొదట రేవతి కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని చెబుతున్నామన్నారు. ఎంత మాట్లాడినా... వారికి ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. కానీ తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటాన్నారు. తనవంతుగా రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. 

మీకు నేను ఉన్నాను... నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బును ఇస్తున్నానన్నారు. రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు. ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామన్నారు. ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట సమయమన్నారు. వారికి ఏ అవసరం కావాలన్నా తాము ఉంటామన్నారు.

సినిమా ప్రియులకు విజ్ఞప్తి

అందరికీ ఒక విజ్ఞప్తి, మేం సినిమా తీసేది మీరు మీ ఫ్యామిలీతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆనందించాలని మాత్రమే... కానీ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది.... కాబట్టి అందరూ కూడా థియేటర్‌కు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సినిమాను చూసి సంతోషంగా ఇంటికి రావాలని ఆకాంక్షించారు.
Allu Arjun
Pushpa
Tollywood
Telangana
Andhra Pradesh

More Telugu News