మంత్రి సత్యకుమార్‌కు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు
- గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్టు మల్లికార్జునపై ఆరోపణలు
- బదిలీపై మళ్లీ ఆయన ధర్మవరం రావడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
- మంత్రి సత్యకుమార్ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ధర్నా
- జిల్లా బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్న పురపాలక అధికారుల సమీక్ష సమావేశానికి కమిషనర్ హజరుకాగా, విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ ను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పోలీసు వాహనంలో కమిషనర్ మల్లికార్జునను తరలించారు.
అనంతరం మంత్రి సత్యకుమార్ బయటకు రావడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆయనను చుట్టుముట్టాయి. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు టీడీపీ కార్యకర్తలను పక్కకు పంపడంతో మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు.