‘పారిస్ ఒలింపిక్స్’ ఆరంభానికి ముందు ఫ్రాన్స్‌లో దుశ్చర్య.. నిలిచిపోయిన ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్
- హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌పై భారీ కుట్ర దాడి
- అనేక చోట్ల రైల్వే సౌకర్యాల దహనం
- ఏకకాలంలో విధ్వంస దాడులు
- పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు దుశ్చర్య
టీజీవీ నెట్‌వర్క్‌ను స్తంభింపజేయడానికి జరిగిన భారీ దాడి ఇది అని, అనేక రూట్లలో రైళ్లను రద్దు చేయాల్సి ఉంటుందని ఎస్ఎన్‌సీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్-పియర్ ఫారండో వివరించారు. రాత్రి ఏకకాలంలో ఈ హానికరమైన దాడులకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. ఈ దాడుల కారణంగా ఉత్తర, తూర్పు మార్గాల్లో రైలు నెట్‌వర్క్ ప్రభావితం అయిందని చెప్పారు. రైలు నెట్‌వర్క్ సౌకర్యాలను దెబ్బతీసేందుకు దాడులకు పాల్పడ్డారని, ప్రభావిత మార్గాలలో రైళ్ల ప్రయాణాలకు భారీ అంతరాయం కలిగిందని జీన్-పియర్ వివరించారు. మరమ్మతులు మొదలయ్యాయని, అయితే వారాంతం వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
8 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారని, పలు రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లించినట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని వివరించారు. సోమవారం నుంచి తిరిగి సర్వీసులు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.
అనూహ్యమైన ఈ పరిణామంపై ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి ప్యాట్రిస్ స్పందించారు. టీజీవీ రైలు నెట్‌వర్క్‌పై భారీ దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. ఇది తీవ్రమైన నేరపూరిత చర్య అని, పారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం జరిగిందన్నారు. కాగా ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది.