ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీపై ఎల్‌కే అద్వానీ ప్రశంసల జల్లు.. అయోధ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ కురువృద్ధుడు!
- అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆ రాముడే ఎంచుకున్నారని పొగడ్తలు
- రామమందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందంటూ వ్యాఖ్యానించిన బీజేపీ దిగ్గజం
- ‘రథయాత్ర’ ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని భావించలేదన్న బీజేపీ అగ్రనేత
దాదాపు 33 ఏళ్ల క్రితం రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన 'రథయాత్ర' గురించి అద్వానీ తన వ్యాసంలో ప్రస్తావించారు. అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనదని, పరివర్తన కలిగించిన ఘట్టమని తాను భావిస్తున్నానని చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా అద్వానీ గుర్తు చేసుకున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమానికి తాను లేనని అటల్ బిహారీ వాజ్‌పేయి బాధపడుతుంటారని వ్యాఖ్యానించారు. రథయాత్ర 33 ఏళ్లు పూర్తి చేసుకుందని, సెప్టెంబర్ 25, 1990న ఉదయం ప్రారంభించిన రథయాత్ర దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారుతుందని తమకు తెలియదని అన్నారు.
శ్రీరాముడిపై ఉన్న విశ్వాసంతో ఉద్యమం ఉద్ధృతం అయిందని వ్యాఖ్యానించారు. రథయాత్ర ఆసాంతం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తన వెంటే ఉన్నట్టు అద్వానీ వ్యాసంలో రాసుకొచ్చారని తెలుస్తోంది. అప్పటికి ప్రధాని మోదీకి అంత గుర్తింపు లేదని, కానీ ఆ సమయంలోనే రాముడు తన ఆలయ పునర్నిర్మాణానికి తన భక్తుడిని (మోదీ) ఎంచుకున్నాడని వ్యాసంలో పేర్కొన్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగా జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.