ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్
- పరారీలో ఉన్న శివరామ్ ను మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు
- పెళ్లి పేరుతో మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అధికారుల వెల్లడి
ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో శివరామ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తన కూతురు మరణానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ప్రవళిక తల్లి ఓ వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రవళిక తల్లిని, సోదరుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. కూతురు బలవన్మరణంతో బాధపడుతున్న ఆ తల్లిని ఓదార్చారు. మరోవైపు, ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.