పవన్ కు చిరంజీవి తర్వాత నేనే అన్నయ్యను.. కమెడియన్ సుధాకర్
- ఫాదర్స్ డే సందర్భంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమెడియన్
- ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చిరు, తను ఒకే రూంలో ఉన్నట్లు వెల్లడి
- తనకు ఏ అవసరం వచ్చినా మెగాస్టార్ ఆదుకుంటారన్న సుధాకర్
దాదాపు 45 ఏళ్ల పాటు వివిధ సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాలు నిర్మించానని సుధాకర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యానని చెప్పారు. ఇటీవల తాను చనిపోయినట్లు మీడియాలో వార్తలు రావడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి బతికే ఉన్నానంటూ చెప్పుకోవాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన టీవీ కార్యక్రమంలో సుధాకర్ తన కుమారుడు బిన్నీతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎమ్మెస్ నారాయణ టైమింగ్ బాగుంటుందని, ఆయన కామెడీ తనకెంతో ఇష్టమని చెప్పారు. బ్రహ్మానందం ఇల్లు తన ఇంటికి దగ్గర్లోనే ఉండేదని, అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవారని తెలిపారు. మెగాస్టార్ కు తనంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ అదే అభిమానం చూపిస్తారని చెప్పారు. తనకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటారని సుధాకర్ తెలిపారు. మెగాస్టార్ దీవెనలతో తన కుమారుడు బిన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు సుధాకర్ వివరించారు.