భయపడుతున్నది అవినాశ్ కాదు.. జగన్ భయపడుతున్నాడు: రఘురామకృష్ణరాజు
- బందరు నుంచి తాడేపల్లికి జగన్ చేరుకున్న వెంటనే అవినాశ్ ను అరెస్ట్ చేస్తారన్న రఘురాజు
- అవినాశ్ కు గుండె జబ్బు అని కొత్త డ్రామా చేస్తే అరెస్ట్ ఆగిపోవచ్చని వ్యాఖ్య
- జగన్ ఆదేశాలతోనే అవినాశ్ ను పోలీసులు కాపాడుతున్నారని మండిపాటు
సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాశ్ భయపడుతున్నారని అందరూ అనుకుంటుంటారని... వాస్తవానికి భయపడుతున్నది అవినాశ్ కాదని, ముఖ్యమంత్రి జగన్ అని రఘురాజు చెప్పారు. సీబీఐ విచారణకు హాజరుకావాలనే హైదరాబాద్ కు అవినాశ్ వచ్చారని... అయితే కడపకు వెళ్లిపో, పులివెందులకు వెళ్లిపో అంటూ జగన్ చెప్పడంతో ఆయన వెళ్లిపోయారని అన్నారు. నిండా మునిగిన వాడికి చలి ఉండదని... ఇప్పటికే అవినాశ్ తండ్రి జైల్లో ఉన్నారని, ఇప్పుడు అవినాశ్ కూడా వెళ్తారని చెప్పారు.
అవినాశ్ రెడ్డి ఆఫ్ట్రాల్ తనలాంటి ఒక సాధారణ ఎంపీ అని... ఒక ఎంపీకి ఏపీలో విలువ లేదనే విషయం అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందని... ఎంపీ అయిన తనను పోలీసులు కొట్టారని, అవినాశ్ ను కూడా పోలీసులు లెక్క చేయరని... కేవలం జగన్ ఆదేశాలతోనే అవినాశ్ ను పోలీసులు కాపాడుతున్నారని రఘురాజు అన్నారు. అవినాశ్ ను అరెస్ట్ చేయడం సీబీఐ మగతనానికి పరీక్ష అని... ఈరోజు వాళ్లు వారి సత్తాను నిరూపించుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. రెండు, మూడు గంటల్లో అవినాశ్ అరెస్ట్ తప్పదని అన్నారు.