బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు!
- ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమ్మేళనంలో అపశ్రుతి
- బాణసంచా కాలుస్తుండగా గుడిసె దగ్ధమై పేలిన సిలిండర్
- గాయపడ్డ వారిలో పోలీసులు, కార్యకర్తలు, జర్నలిస్టులు!
పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. ఆ మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు పక్కనే ఉన్న ఓ ఇంటికి వ్యాపించి ఓ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్టు సమాచారం. వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మందికి కాళ్లు చేతులు విరిగిపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలముకుంది. అప్పటి వరకు నేతల రాకతో సందడిగా ఉన్న ప్రాంతం పేలుడు తర్వాత రక్తసిక్తమైంది.