ఈడీ అరెస్టులు ఏకపక్షం కాదు!.. చిదంబరం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
- ఈడీ చర్యలన్నీ సమర్థనీయమైనవేనన్న సుప్రీంకోర్టు
- నిందితులకు ఈసీఐఆర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడి
- అరెస్ట్ సందర్భంగా ఫిర్యాదు వివరాలు చెబితే సరిపోతుందన్న ధర్మాసనం
- బెయిల్ రాకుండా ఈడీ చెప్పే కారణాలూ సమర్థనీయమైనవేనని స్పష్టీకరణ
మనీ ల్యాండరింగ్ కేసుల విచారణలో ఈడీ అధికారులను నిలువరించాలంటూ చిదంబరంతో పాటు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణను పూర్తి చేయగా... తాజాగా బుధవారం ఈ కేసులో తుది తీర్పు ఇచ్చింది. మనీ ల్యాండరింగ్ చట్టంలోని ప్రొవిజన్లన్నీ సమర్థనీయమైనవేనని కోర్టు స్పష్టం చేసింది. ఈడీతో పాటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఏ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లకు చెందిన అధికారులు పోలీసులు కాదన్న కోర్టు... విచారణ సమయంలో ఆయా విభాగాల అధికారులు రికార్డ్ చేసే వాంగ్మూలాలను చట్టబద్ధమైన సాక్ష్యాలుగానే పరిగణించవచ్చని తెలిపింది.
ఇక మనీ ల్యాండరింగ్ కేసుల విచారణ సందర్భంగా ఈడీ లాంటి సంస్థల అధికారులు నిందితులకు ప్రతిసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అధికారులు ఫిర్యాదు వివరాలను చెబితే సరిపోతుందని కూడా కోర్టు పేర్కొంది. ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ కాదన్న కోర్టు... నిందితుల బెయిల్‌ను తిరస్కరించే దిశగా ఈడీ అధికారులు చెప్పే రెండు కఠినమైన షరతులు కూడా చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది.