Akhil: మెగా ఫ్యామిలీ సపోర్టు నాకు ఎప్పటికీ ఉంటుంది: 'బొమ్మరిల్లు' భాస్కర్!
- 'ఆరెంజ్' కొంతమందికి బాగా నచ్చింది
- సరైన సమయంలో రిలీజ్ కాలేదు
- అందుకే ఫ్లాప్ అయిందనుకుంటున్నాను
- మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యం అలాగే ఉంది
'బొమ్మరిల్లు' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతలా ఆ సినిమాను తెరపై ఆవిష్కరించిన భాస్కర్ కి, ఆ సినిమా టైటిల్ ఇంటిపేరుగా మారిపోయింది. అలాంటి భాస్కర్ తాజా చిత్రంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రూపొందింది. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా పూజ హెగ్డే అలరించనుంది.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లను భాస్కర్ మొదలుపెట్టేశాడు. తాజా ఇంటర్వ్యూలో 'ఆరెంజ్' సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా వలన వచ్చిన నష్టాల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందని నాగబాబు అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై భాస్కర్ స్పందిస్తూ .. 'ఆరెంజ్' సినిమా ఇప్పటికీ కొంతమంది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఆ సినిమా పరాజయం పాలుకావడానికి ప్రధానమైన కారణం, సరైన సమయంలో రిలీజ్ కాకపోవడమేనని నేను అనుకుంటున్నాను. ఆ సినిమా వలన మెగా ఫ్యామిలీతో నా రిలేషన్ దెబ్బతినలేదు. నాకు వాళ్ల సపోర్టు ఎప్పటికీ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.