పెరుగుతున్న కరోనా వ్యాప్తి... రజనీకాంత్ సినిమా మరింత ఆలస్యం!
- అన్నాత్తే చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
- ఇటీవల హైదరాబాదులో చిత్రీకరణ
- రజనీకి అనారోగ్యం.. నిలిచిన షూటింగ్
- దేశంలో మరోసారి కొత్త కేసుల తీవ్రత
అన్నాత్తే షూటింగ్ లో పాల్గొంటానని కొన్నిరోజుల కిందటే రజనీ ఉత్సాహంగా ప్రకటించారు. కానీ దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో రజనీ బయటికి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. వీలైనంతవరకు ఇంట్లోంచి బయటికి రావొద్దని కేంద్రం 60 ఏళ్లకు పైబడినవారికి కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పైగా మహారాష్ట్రలో కొత్త కేసుల ఉద్ధృతి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ సెట్స్ పైకి రావడం ఎంతో రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని చిత్రయూనిట్ ఆందోళన చెందుతోంది. దాంతో ఆ సినిమా చిత్రీకరణ మరికొంత ఆలస్యం కానుంది.
వాస్తవానికి అన్నాత్తే చిత్రాన్ని ఈ వేసవిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ, షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఇప్పటివరకు టాకీ పార్ట్ పూర్తికాలేదు. దాంతో రిలీజ్ ను దీపావళికి వాయిదా వేశారు. దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది.