నా గురించి శ్రీకాంత్ మాటలు పడుతున్నాడు.. ఇదే చివరి పోటీ!: శివాజీ రాజా
- నేను పోటీ చేయకుంటే ఓ ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది
- దేవుడు దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను
- నరేశ్ తీరుతో ఇండస్ట్రీని వదిలి అరుణాచలం వెళ్లిపోదామనుకున్నా
ఎన్నికల సమయంలో టీవీల్లో ఎవరూ మాట్లాడకూడదన్న నిబంధన ఉందని, కానీ సోదరుడు నరేశ్, బావ రాజశేఖర్, అక్క జీవిత టీవీల్లో మాట్లాడుతూ తమపై బురద జల్లుతున్నారని శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి శ్రీకాంత్ మాటలు పడుతున్నాడని, తనకు మద్దతు ఇచ్చేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి ప్రముఖ దర్శకుడు వచ్చాడని పేర్కొన్నాడు. ఇటీవల నరేశ్ తనను చాలా బాధపెట్టాడని, అప్పుడే ఇండస్ట్రీని వదిలి అరుణాచలం వెళ్లి స్థిరపడాలని అనిపించిందన్నాడు.
ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తన వంతుగా శివాజీకి సాయం చేయాలనే ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్టు చెప్పాడు. రూ. 2.90 కోట్లు ఉన్న ‘మా’ సంక్షేమ నిధిని శివాజీ రాజా రూ.5.70 కోట్లకు పెంచాడని కొనియాడారు. తన నామినేషన్‌ను సరైన కారణం లేకుండానే తిరస్కరించారని, బహుశా తను ట్రెజరర్ గా ఉండడం నరేశ్‌కి ఇష్టం లేదేమోనని పరుచూరి వెంకటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. ‘మా’కి సొంత భవనం కావాలంటే శివాజీ రాజా ప్యానెల్‌ను గెలిపించాలని శ్రీకాంత్ కోరాడు.