గణపతి ఆరాధన ఫలితం
తొలి పూజ వినాయకుడికి చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు .. మహర్షులు సైతం తొలిగా వినాయకుడినే పూజిస్తూ వుంటారు. ఇక ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా అది వినాయకుడి ఆరాధనతోనే మొదలవుతుంది. తలపెట్టిన కార్యం విజయవంతమైతేనే ఆశించిన ఫలితం చేకూరుతుంది. జీవితంలో అడుగు ముందుకు వేయడానికి .. అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే వుంటారు. అలాంటి సమయంలో ఆరంభించే పనులు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందుకు సాగిపోవలసి ఉంటుంది.
అలా జరగాలంటే అందుకు వినాయకుడి అనుగ్రహం కావలసి ఉంటుంది. వినాయకుడిని పూజించడం వలన అన్ని అడ్డంకులు తొలగిపోయి .. తలపెట్టిన కార్యం సఫలీకృతమవుతుంది. క్షీరసాగర మథనం సమయంలో 'మందర పర్వతం' నీట మునుగుతుండటం అందరికీ నిరాశను కలిగిస్తుంది. వినాయక పూజ చేయకపోవడం వల్లనే అలా జరిగిందని శ్రీ మహా విష్ణువు చెప్పడంతో, అంతా గణపతిని ఆరాధిస్తారు. ఫలితంగా అత్యంత కష్టతరమైన ఆ కార్యం సఫలీకృతమవుతుంది.