దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యం
దీపావళి రోజున ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో .. బంతిపూల దండలతో అందంగా అలంకరించబడి ఉంటుంది. దీపావళికి వచ్చే బంధువులతో ఏ ఇల్లు చూసినా సందడిగా కనిపిస్తుంటుంది. ఈ రోజున సాయంత్రం కుటుంబ సభ్యులంతా కలిసి, కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. కొత్త నాణాలు సేకరించి అమ్మవారి 108 నామాలు చెబుతూ ఆ తల్లికి పూజ చేస్తారు. అలా పూజ చేసిన నాణాలను ఒక మూటకట్టి బీరువాలో వచ్చే దీపావళికి వరకూ జాగ్రత్తగా ఉంచుతారు. అలా చేయడం వలన సంపదలు పెరుగుతాయని భావిస్తుంటారు. పూజ అనంతరం కొంతసేపటి క్రితం చేసిన పిండివంటలు .. మిఠాయిలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీదేవికి 'కేసరిబాత్' అంటే చాలా ఇష్టం కనుక, 'కేసరి బాత్' చేసి నైవేద్యంగా సమర్పించినవారు ఆమె ప్రీతికి పాత్రులవుతారు. అమ్మవారి అనుగ్రహం వుంటే సంతోషకరమైన .. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే .. అన్నీ వున్నట్టే.