అందుకే ఈ క్షేత్రానికి ఆ పేరు
ఏ రూపంలో కొలవబడుతున్నా .. ఏ నామంతో పిలవబడుతున్నా భగవంతుడు ఒక్కడే. ఆ స్వామి కొలువైన క్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు ఎంతగానో ఆసక్తిని చూపుతుంటారు. అలా భక్త జన సందోహంతో సందడి చేసే క్షేత్రాలకి ఆయా పేర్లు రావడానికి కనిపించే కారణాలు ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. 'ముక్తేశ్వర' క్షేత్రాన్ని దర్శించినప్పుడు అలాంటి అనుభూతే కలుగుతూ ఉంటుంది.
కృష్ణా జిల్లాలోని ప్రాచీన క్షేత్రాలలో 'ముక్త్యాల' ఒకటిగా కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని 'ముక్తేశ్వరం' అని కూడా అంటూ వుంటారు. పూర్వం బలిచక్రవర్తి ఇక్కడి స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడని స్థల పురాణం చెబుతోంది. ఎంతోమంది మహర్షులు ఇక్కడి స్వామివారిని సేవించి ముక్తిని పొందారు. అందువలన ఈ క్షేత్రానికి 'ముక్తేశ్వరం' అనే పేరు వచ్చిందని అంటారు. కాలక్రమంలో వాడుక భాషలో ఇది 'ముక్త్యాల'గా మారింది.
ఎంతోమంది మహారాజులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించారు. మరెంతోమంది మహాభక్తులు స్వామివారిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆవిర్భవించిన ఇక్కడి ముక్తేశ్వరుడిని సేవించి, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులవుతుంటారు.