దంపతి సమేత దక్షిణామూర్తి దర్శన ఫలితం !

వివాహమనేది స్త్రీ పురుషుల జీవితంలో ప్రధానమైన మలుపుకు కారణమవుతూ వుంటుంది. కడవరకూ లభించాలని ఆశించే సుఖసంతోషాలు ఈ విషయంపైనే ఆధారపడి వుంటాయి. అందువలన అటు అబ్బాయి తరఫువాళ్లు ... ఇటు అమ్మాయి తరఫువాళ్లు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.

ఈ కారణంగా ఆశించిన స్థాయి సంబంధాలు దొరకడం ఒక్కోసారి ఆలస్యమవుతూ వుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయా దోషాల కారణంగా కూడా వివాహ ప్రయత్నాలు ఫలించక ఆలస్యం జరుగుతుంటుంది. కారణమేదైనా అబ్బాయిలు ... అమ్మాయిలు .. వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందా అని ఎదురుచూస్తూ వుంటారు.

ఇలా వివాహానికి సంబంధించిన సమస్యతో బాధపడేవాళ్లు, దంపతి సమేత దక్షిణామూర్తిని దర్శించడం వలన ప్రయోజనం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'సురుటుపల్లి' క్షేత్రంలో దంపతి సమేత దక్షిణామూర్తి ఆలయం వుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో పార్వతీ సమేతుడైన దక్షిణామూర్తి కూడా దర్శనమిస్తుంటాడు.

వివాహ సంబంధమైన సమస్యలతో బాధలుపడుతోన్న వాళ్లు ఇక్కడ దంపతి సమేతుడైన దక్షిణామూర్తిని దర్శించుకుంటూ వుంటారు. నందీశ్వరుడిపై వున్న దక్షిణామూర్తిని అమ్మవారు ఎడమవైపు నుంచి ఆలింగనం చేసుకుని కనిపిస్తుంది. అయ్యవారు ... అమ్మవారు ఇద్దరూ కూడా ఆలుమగల మధ్య గల అనురాగానికి ప్రతీకగా కనిపిస్తుంటారు.

వివాహం విషయంలో ఆటంకాలు ఎదుర్కుంటోన్న వాళ్లు దక్షిణామూర్తినీ ... అమ్మవారిని దర్శించడం వలన ఆశించిన ఫలితం అనతికాలంలోలోనే లభిస్తుందట. స్వామివారు ... అమ్మవారి ఆశీస్సుల కారణంగా వివాహయోగం కలగడమే కాకుండా, వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో సాగిపోతుందని ఇక్కడి వాళ్లు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News