స్వామివారి చందనం మహిమగలదట !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వామివారి చందనం మహిమగలదట !

స్వామివారి చందనం మహిమగలదట !
లక్ష్మీనృసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలన్నీ కూడా పవిత్రమైనవిగా ... శక్తిమంతమైనవిగా ... మహిమాన్వితమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే భక్తులు తమ కష్టాలు చెప్పుకోవడానికి స్వామివారి సన్నిధికి తరలివస్తుంటారు ... ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు. అలాంటి నృసింహస్వామి క్షేత్రాల్లో 'మల్లూరు' ఒకటిగా చెప్పబడుతోంది. వరంగల్ జిల్లా ... మంగపేట మండల పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

గర్భాలయంలోని లక్ష్మీనృసింహస్వామి ప్రత్యక్షంగా కూర్చున్నట్టుగా కనిపిస్తుంటాడు. స్వామివారిని తాకితే ఆ విగ్రహం మెత్తగా ... చల్లగా ఉంటుందని అర్చకులు చెబుతుంటారు. అత్యంత ప్రాచీనమైనదిగా ... స్వయంభువుగా మూలమూర్తిని గురించి చెప్పబడుతోంది. ఇక్కడి స్వామివారి విగ్రహం 'నాభి' ప్రదేశం నుంచి ఒక రకమైన ద్రవం స్రవిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన భరద్వాజ మహర్షి, కాలగర్భంలో కలిసిపోయిన ఈ విగ్రహాన్ని వెలికితీయించడం జరిగింది.

ఆ సమయంలోనే విగ్రహానికి నాభి ప్రదేశంలో గాయమై, అక్కడి నుంచి రక్తం స్రవించిందట. జరిగినదానికి ఎంతగానో బాధపడిన మహర్షి, స్వామివారికి ఉపశమనం కలిగిస్తూ శాంతింపజేశాడు. అయినా స్వామివారి నాభి భాగం నుంచి స్రవించే ద్రవం ఆగకపోవడంతో, అక్కడ చందనం అద్దడం ప్రారంభించారు. ఇప్పటికీ అలా ద్రవం స్రవిస్తూనే వుంది ... దానిని ఆపడం కోసం చందనం అద్దబడుతూనే వుంది.

అలా అద్దబడుతోన్న చందనం మహిమను కలిగి ఉంటుందని భక్తులు భావిస్తుంటారు. అచెంచలమైన భక్తి విశ్వాసాలతో ఈ చందనాన్ని స్వీకరిస్తూ వుంటారు. తమ కూడా ఇంటికి తీసుకువెళుతూ వుంటారు. ఈ చందనం చెంతనుంచుకోవడం వలన ఆరోగ్యపరమైన సమస్యలు .. గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఒక్క చందనం విషయంలోనే కాదు, అడుగడుగునా అనేక రకాల విశేషాలను సంతరించుకున్న ఈ క్షేత్రం నిజంగా మహిమాన్వితమైనదే.

More Bhakti Articles