దొంగలకు దేవుడి దర్శనం ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దొంగలకు దేవుడి దర్శనం ?

దొంగలకు దేవుడి దర్శనం ?
తులసీదాస్ నిరంతరం శ్రీరామ నామాన్ని జపిస్తూ, రామనామ మహిమ వలన అనిర్వచనీయమైన అనుభూతిని పొందసాగాడు. రాముడిని కీర్తిస్తూ ఆ పారవశ్యంలో ఆకలిదప్పులు మరిచిపోతుంటాడు. తులసీదాస్ తీరును మొదట్లో చిత్రంగా చూసిన ప్రజలు, క్రమంగా ఆయన భక్తిలోని గాఢతను అర్థంచేసుకోవడం మొదలుపెడతారు. తులసీదాస్ కి చేసిన నమస్కారం శ్రీరామచంద్రుడికి చేరుతుందనే స్థితికి వాళ్లు చేరుకుంటారు.

ఈ సమయంలోనే తులసీదాస్ 'రామచరిత మానస్' ను రచిస్తాడు. అపూర్వమైన ఆ గ్రంధాన్ని అసమానమైన ఆయన భక్తికి నిదర్శనంగా చాలామంది భావిస్తారు. కొందరు పండితులకు మాత్రం ఇది తీవ్రమైన అసూయ ద్వేషాలను కలిగిస్తుంది. దాంతో రామచరిత మానస్ గ్రంధాన్ని అపహరించాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. పథకం ప్రకారం ఆ రాత్రి కొంతమంది దొంగలను తులసీదాస్ ఆశ్రమానికి పంపిస్తారు.

తులసీదాస్ ఆశ్రమ సమీపానికి చేరుకున్న దొంగలు, ధనుర్బాణాలు ధరించి కాపలాకాస్తూ వుండటం చూస్తారు. వాళ్లని ఎదిరించడానికి సిద్ధపడుతూ ఆ దొంగలు ఒక అడుగుముందుకు వేస్తారు. అంతే ఊహించనంత వేగంగా వాళ్లు వదిలిన బాణాలు దారికి అడ్డుగా గీత గీసినట్టుగా భూమిలో నాటుకుంటాయి. ఇంకో అడుగు ముందుకుపడితే ఏం జరుగుతుందో గ్రహించిన దొంగలు, వెనక్కితిరిగి చూడకుండా పరుగందుకుంటారు.

మనసు మార్చుకున్న ఆ దొంగలు మరుసటి ఉదయం తులసీదాస్ ఆశ్రమానికి చేరుకొని, రాత్రి తమకి ఎదురైన సంఘటన గురించి చెబుతారు. ఆశ్రమానికి కాపలాగా వున్న ఆ ఇద్దరు వీరులు ఎవరంటూ ఆసక్తిగా అడుగుతారు. సాక్షాత్తు రామలక్ష్మణులై ఉంటారని తులసీదాస్ చెప్పడంతో, ఒక్కసారిగా వాళ్లు ఆయన పాదాలపై పడిపోతారు. మహాభక్తులకు మాత్రమే లభించే రామలక్ష్మణుల దర్శనభాగ్యం వాళ్లకి కలిగినందుకు తులసీదాస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక నుంచి మంచి మార్గంలో జీవనాన్ని కొనసాగిస్తూ భగవంతుడి అనుగ్రహాన్ని పొందమని హితవు చెబుతాడు.

More Bhakti Articles