కుంతీ మాధవుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుంతీ మాధవుడు

కుంతీ మాధవుడు
ఉత్తర భారతాన్ని ... దక్షిణ భారతాన్ని చారిత్రక పరంగాను ... ఆధ్యాత్మిక పరంగాను పాండవులు ప్రభావితం చేశారు. ఈ కారణంగానే చాలా పుణ్యక్షేత్రాలలో పాండవులకి సంబంధించిన ఏదో ఒక కథనం వినిపిస్తుంది. జూదంలో ఓడిపోయిన పాండవులు కౌరవుల షరతు మేరకు 12 సంవత్సరాలు అరణ్యవాసం ... ఒక సంవత్సరం పాటు అజ్ఞాత వాసం చేశారు. ఈ సమయంలోనే వాళ్లు అనేక క్షేత్రాలను దర్శించడం ... అక్కడి ప్రాంతాన్ని తమదైన రీతిలో ప్రభావితం చేయడం జరిగింది.

అలాంటి విశిష్టతను సంతరించుకున్న క్షేత్రం మనకి విజయనగరం జిల్లాలోని భీమునిపట్నం దర్శనమిస్తుంది. భీముడి కారణంగానే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని అంటారు. పాండవులు అనేక క్షేత్రాలను దర్శిస్తూ వచ్చి ఇక్కడి కొండపై కొంతకాలం గడిపారు. ఆ సమయంలో వాళ్లు అజ్ఞాతవాసంలో వున్నారు. ఎవరు గుర్తించినా మొదటికే మోసం వస్తుందని వాళ్లంతా తీవ్రమైన ఆందోళనకి లోనవుతున్నారు.

ఆ సమయంలో అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు, అనవసరమైన భయాందోళనలు వద్దనీ ధైర్యం చెప్పాడు. ఈ కొండపై తాను ఉంటాననీ ... వాళ్లని సదా కాపాడుతూ ఉంటానని మాటిచ్చాడు. అనంతపద్మనాభ స్వామి వ్రతం ఆచరించమనీ, అందువలన ఆటంకాలు తొలగిపోతాయని సెలవిచ్చాడు. అజ్ఞాతవాస సమయంలో శ్రీకృష్ణుడు ఈ కొండపై కొలువై వారిని రక్షించాడని తెలుసుకున్న కుంతీదేవి ఆ తరువాత ఈ ప్రదేశంలో మాధవుడిని ప్రతిష్ఠించి పూజించిందట. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని కుంతీ మాధవుడని పిలుస్తూ వుంటారు. ఆ తరువాత కాలంలో ఇక్కడి స్థల పురాణం గురించి తెలుసుకున్న విజయనగర రాజుల అన్వేషణ ఫలించి ఆ విగ్రహం బయటపడిందట.

దాంతో పాండవుల ఎదుట శ్రీ కృష్ణుడు ప్రత్యక్షమై అనంతపద్మనాభస్వామి వ్రతం చేసుకోమని చెప్పిన ప్రదేశంలో పద్మనాభస్వామి విగ్రహాన్ని ... కొండ దిగువున మాధవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఇక్కడి స్వామికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడి స్వామిని దర్శించడం వలన, ఎలాంటి కష్టాలైనా కరిగిపోతాయని స్థానికులు చెబుతుంటారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయాలు, భక్తులకు ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి.

More Bhakti Articles