పదవీ విరమణ తర్వాత రామ్ నాథ్ కోవింద్ కు వచ్చే పెన్షన్, ఇతర సదుపాయలు ఏంటో తెలుసా?

  • ఈ నెల 24తో ముగియనున్న రాష్ట్రపతి కోవింద్ పదవీ కాలం
  • సోనియాగాంధీ బంగళా పక్కనున్న బంగళాకు షిఫ్ట్ కానున్న రాష్ట్రపతి
  • ప్రతి నెల రూ.1.50 లక్షల పెన్షన్ అందుకోనున్న కోవింద్
భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ నెల 23న కోవింద్ గౌరవార్థం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫేర్ వెల్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కోవింద్ కు మెమెంటోతో పాటు, పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసిన సిగ్నేచర్ బుక్ ను బహూకరించనున్నారు. 

రామ్ నాథ్ కోవింద్ పదవీ విరమణ పొందే రోజుకు రెండు రోజుల ముందు అంటే ఈ నెల 22న... ఆయనకు చెందిన సామగ్రినంతటినీ రాష్ట్రపతి భవన్ నుంచి కొత్త బంగళాకు తరలించనున్నారు. ఈ నెల 25న ఆయన రాష్ట్రపతి భవన్ ను ఖాళీ చేస్తారు. 10 జన్ పథ్ లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బంగళాకు ఆనుకుని ఉన్న బంగళాను కోవింద్ కు కేటాయించారు.     

రిటైర్మెంట్ తర్వాత కోవింద్ కు అందే పెన్షన్, ఇతర సదుపాయాలు ఇవే:
  • ప్రతి నెల రూ. 1.50 లక్షల రూపాయల పెన్షన్ లభిస్తుంది. 
  • సెక్రటేరియల్ స్టాఫ్, ఆఫీస్ ఖర్చులకు నెలకు రూ. 60 వేలు ఇస్తారు. 
  • కోవింద్ కు కేటాయించిన బంగళా పూర్తిగా ఉచితం. ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. 
  • రెండు ల్యాండ్ లైన్లు, ఒక మొబైల్ ఫోన్, బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. 
  • ఎలెక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 
  • కారు, డ్రైవర్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. 
  • ఆరోగ్య సదుపాయాలు మొత్తం ఉచితం. 
  • విమాన, రైలు ప్రయాణాలు ఉచితం. కోవింద్ తో పాటు ఒక సహాయకుడు ఉచితంగానే ప్రయాణించవచ్చు. 
  • ఐదుగురు పర్సనల్ స్టాఫ్ ను కేంద్రమే కేటాయిస్తుంది. 
  • ఢిల్లీ పోలీసులతో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. 
  • ఇద్దరు సెక్రటరీలను కేటాయిస్తారు.


More Telugu News