టీ, కాఫీలు బాగా తాగుతారా? అయితే, వాటివల్ల లాభ నష్టాలు ఏమిటో చూడండి!

  • భారతీయుల ఆహారపు అలవాట్లలో టీ, కాఫీలకు ప్రాధాన్యత
  • మితిమీరితే సమస్యలు తప్పవన్న నిపుణులు
  • పరిమిత సేవనమే ఆరోగ్యదాయకం అని వెల్లడి
భారతీయుల ఆహారపు అలవాట్లలో టీ, కాఫీలకు ప్రముఖ స్థానం ఉంది. రోజుకు ఒక్కసారి తాగే వారి నుంచి రోజుకు లెక్కకు మిక్కిలిగా తాగే వారి వరకు అనేక మందికి ఈ పానీయం తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అయితే, టీ, కాఫీలతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని, పరిమితంగా తీసుకోకపోతే వాటితో ప్రతికూల ప్రభావం తప్పదని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తేనీరు సేవించడం వల్ల కలిగే లాభాలేంటో చూస్తే..
  • టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. కొవ్వు పదార్థాలైన ట్రైగ్లిజరైడ్స్ ను కొంతమేర తగ్గిస్తాయి.
  • కొవ్వు పదార్థాలను కొంత మేర తగ్గిస్తుంది కాబట్టి, పక్షవాతాన్ని కూడా కొంతవరకు నిరోధించగలదు. పక్షవాతాన్ని నివారించే గుణం గ్రీన్ టీలో మరింత ఎక్కువట.
  • రక్తనాళాల్లోని లోపలి పొర ఎండోథీలియంలో రక్తం సాఫీగా ప్రసరణ జరిగేందుకు టీ తోడ్పడుతుంది. అందుకే కొంతమేర బ్రెయిన్ స్ట్రోక్ ను తగ్గిస్తుందట.
  • అయితే, టీ కారణంగా కలిగే ప్రయోజనాలు అందుకోవాలంటే అప్పటికప్పుడు కాచిన టీనే తాగాలి. అందులో ఉండే కాటేచిన్, ఫ్లేవనాయిడ్స్ తాజా టీలోనే అధికంగా ఉంటాయి. సమయం గడిచే కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయి.
టీ వల్ల కలిగే నష్టాలు!
  • ఆహారం, కూరగాయలు, పండ్ల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్ ను శరీరం శోషింపచేసుకోవడంలో టీ ప్రతిబంధకంగా మారుతుంది.
  • సుదీర్ఘకాలం పాటు టీ ఎక్కువగా తాగేవారిలో ఫ్లోరోసిస్ రావొచ్చట.
కాఫీతో లాభాలు
  • కాఫీ అంటే ఉత్తేజానికి మారుపేరు అని చెబుతారు. అందులో వందల కొద్దీ జీవరసాయనాలు ఉంటాయి. అందుకే కాఫీ తాగగానే శరీర స్థితిలో స్వల్ప మార్పు కనిపిస్తుంది.
  • కాఫీలో మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఔషధగుణాలున్న పదార్థం ఉంటుంది.
కాఫీతో నష్టాలు!
  • హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాఫీ తాగిన కాసేపట్లోనే బీపీలో పెరుగుదల కనిపిస్తుంది. కనీసం గంట సేపైనా ఈ ప్రభావం ఉంటుందట.
  • కాఫీ యాంగ్జైటీ పెరుగుదలకు కారణమవుతుంది. తద్వారా శరీరంలో కొన్నిసార్లు వణుకు కనిపిస్తుంది.
  • రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తాగేవారిలో గ్లకోమా అనే కంటి సంబంధ జబ్బు వచ్చే అవకాశముంటుంది.


More Telugu News