566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు
- భారత సంతతికి చెందిన రాహుల్ శర్మ
- శ్రీలంక దక్షిణం నుంచి ఉత్తరం వరకు పరుగెత్తి రికార్డు
- చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం ఈ సాహసం
- ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకు పైగా విరాళాలు
- గాయాలు, నొప్పులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అథ్లెట్
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్పోర్ట్స్ ఫిజియాలజిస్టుగా పనిచేస్తున్న రాహుల్ శర్మ, చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం నిధులు సేకరించాలనే లక్ష్యంతో ఈ పరుగు చేపట్టాడు. ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకుపైగా విరాళాలు సమకూరాయి. శ్రీలంకలోని పాయింట్ పెడ్రో నుంచి డోండ్రా హెడ్ వరకు 6 రోజుల 13 గంటల 22 నిమిషాల్లో చేరుకుని దేశం మొత్తం పరుగెత్తిన అత్యంత వేగవంతమై అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.
ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పరుగెత్తిన రాహుల్, రోజుకు కేవలం మూడు గంటలే నిద్రపోయాడు. 32 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు, శారీరక నొప్పులు అతణ్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. రెండో రోజే అతడి సాక్స్ కరిగి కాళ్లకు అంటుకున్నాయి. చివరి దశలో నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో 20 కిలోమీటర్లు పరుగెత్తి, మరో 60 కిలోమీటర్లు నడిచి పూర్తి చేశాడు.
హాంకాంగ్‌లో పెరిగిన రాహుల్ ఒకప్పుడు అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడాడు. గాయాల కారణంగా క్రికెట్‌కు దూరమైన తర్వాత క్రీడల్లో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ ఫిజియాలజిస్టుగా పనిచేస్తూనే అల్ట్రా రన్నింగ్‌లో రాణిస్తున్నాడు.