ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!

Indian Railways to launch new reservation system from August for easy ticket booking
  • 40 ఏళ్ల పాత సిస్టమ్ ను మార్చనున్నట్లు వెల్లడి
  • కొత్త వ్యవస్థతో వేగంగా టికెట్ల బుకింగ్
  • 88 శాతం డిజిటల్ టికెట్లే కొంటున్న ప్రయాణికులు
  • రికార్డు స్థాయిలో రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్లు
  • ఏఐ టూల్‌తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త వ్యవస్థతో పూర్తిగా మార్చేయనుంది.

మరింత వేగంగా బుకింగ్స్
ఈ సరికొత్త అప్‌గ్రేడ్ వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సిస్టమ్‌కు మారే ప్రక్రియపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సాంకేతిక మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని అధికారులను ఆదేశించారు.

డిజిటల్ వైపు ప్రయాణికులు
రైల్వే శాఖ 2002 సంవత్సరంలో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి కౌంటర్ల కంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైల్వే టికెట్లలో దాదాపు 88 శాతం బుకింగ్స్ కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ భారీ డిమాండ్‌కు అనుగుణంగానే పాత వ్యవస్థను అధునాతన సాంకేతికతతో రైల్వే మారుస్తోంది.

‘రైల్ వన్’ యాప్ రికార్డు
రైల్వే శాఖ డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది జులైలో ప్రారంభించిన ‘రైల్ వన్’ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాది లోపే ఈ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లను దాటేసింది. ఈ ఒక్క యాప్ ద్వారానే టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రైలు లైవ్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ సమాచారం, ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది.

ఏఐ వెయిటింగ్‌ లిస్ట్‌
కొత్త సిస్టమ్‌తో పాటు ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వెయిటింగ్ లిస్ట్ టూల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే అవకాశాలను ఈ టూల్ ముందుగానే అంచనా వేస్తుంది. దీని అంచనా కచ్చితత్వం గతంలో 53 శాతంగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 94 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్లాన్లను మరింత సులభంగా మార్చుకోవచ్చు.
Go Back to Shorts
Indian Railways
New Reservation System
Online Ticket Booking
Rail One App
AI Waiting List Prediction
Ashwini Vaishnaw

More Telugu News