హర్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ కొత్త ప్లాన్.. ఇకపై ప్రయాణ రుసుములు!

Strait of Hormuz Iran and Oman new plan to impose transit fees on ships
  • నౌకల రవాణా కోసం ‘హర్మూజ్’ను తెరిచి ఉంచుతామన్న ఇరాన్ 
  • ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా నిర్ణయించే కొత్త నిబంధనల ప్రకారమే రాకపోకలు 
  • జలసంధిని ఉపయోగించుకునే వాణిజ్య నౌకలపై 'ట్రాన్సిట్ లేదా సర్వీస్ ఫీజు' విధింపు 
  • ఈ రుసుములను పన్నులుగా కాకుండా రక్షణ, సహాయక చర్యల పరిహారంగా ఇరాన్ అభివర్ణన 
  • అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉచిత రవాణా ఉండాలంటున్న అమెరికా
అంతర్జాతీయంగా ముడిచమురు, సహజ వాయువు (LNG) రవాణాకు అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) భవిష్యత్తుపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా పాక్షికంగా మూతబడిన ఈ జలసంధిని అంతర్జాతీయ నౌకల రాకపోకల కోసం తెరిచే ఉంచుతామని, అయితే ఇకపై కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఇరాన్ స్పష్టం చేసింది. రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెం జలాలీ సోమవారం రష్యా వార్తాపత్రిక 'ఇజ్వెస్టియా'తో మాట్లాడుతూ.. ఇరాన్, ఒమన్ దేశాలు సంయుక్తంగా రూపొందించే సరికొత్త ఫ్రేమ్‌వర్క్ ఆధారంగానే ఈ జలసంధిలో రవాణా సాగుతుందని వెల్లడించారు.

ఈ కొత్త నిబంధనలలో భాగంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై 'ట్రాన్సిట్ లేదా సర్వీస్ ఫీజు' (రవాణా రుసుము) విధించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో ఐదో వంతు ఈ సముద్ర మార్గం నుంచే వెళ్తుంది. మార్చి 2026 లో ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు దీనిని పూర్తిగా పునరుద్ధరించడానికి సిద్ధమవుతున్నప్పటికీ.. ఇరాన్, ఒమన్ దేశాలు అక్కడ అందించే రక్షణ, నిఘా, సెర్చ్ అండ్ రెస్క్యూ (సహాయక చర్యల) సేవలకు గానూ ఈ ఫీజులను వసూలు చేయనున్నట్లు రాయబారి పేర్కొన్నారు.

పెరగనున్న చమురు ఖర్చులు
ఇరాన్ ప్రతిపాదిస్తున్న ఈ రవాణా రుసుములపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం హర్మూజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా నౌకలు ప్రయాణించే హక్కు ఉందని అమెరికా వాదిస్తోంది. ఇరాన్‌కు ఎలాంటి ఫీజులు చెల్లించవద్దని, ఈ వసూళ్ల దందాలో భాగస్వామి కావద్దని ఒమన్‌ను కూడా అమెరికా హెచ్చరించింది. అయితే, యుద్ధ భయాలు, బీమా ప్రీమియంలు పెరిగిపోవడం, ప్రయాణంలో ఆలస్యం కావడం కంటే.. ఇరాన్‌కు కొంత ఫీజు చెల్లించి సురక్షితంగా వెళ్లడమే మేలని కొన్ని అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు భావిస్తున్నాయి.

నివేదికల ప్రకారం ఈ ఫీజులు నౌక పరిమాణం, మోసుకెళ్లే సరుకును బట్టి ఒక్కో నౌకకు గరిష్టంగా 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 16 కోట్లు) వరకు ఉండే అవకాశం ఉంది. రష్యా వంటి మిత్రదేశాలకు మాత్రం ఇరాన్ ఇప్పటికే ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఏప్రిల్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఈ సముద్ర మార్గాన్ని శాశ్వతంగా పునరుద్ధరించేందుకు ఇరాన్-ఒమన్ సంయుక్త కమిటీ చర్చలు జరుపుతోంది. ఈ ప్రకటన గ్లోబల్ మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చినప్పటికీ.. కొత్తగా విధించే ఫీజుల భారం చివరకు వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Strait of Hormuz
Iran
Oman
Shipping transit fees
Global oil supply
International maritime trade

More Telugu News