నాడు హీరో.. నేడు విలన్: గ్రేటర్ నోయిడాలో డెలివరీ బాయ్ అరెస్ట్!

Moninder Greater Noida delivery boy arrested for extortion case
  • గ్రేటర్ నోయిడాలో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న అన్నదమ్ముల అరెస్ట్ 
  • నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 మామూళ్లు డిమాండ్ 
  • అరెస్ట్ అయిన వారిలో గతంలో హీరోగా గుర్తింపు పొందిన డెలివరీ బాయ్ మోనిందర్ 
  • నిందితులపై గతంలోనే గూండా యాక్ట్, బెదిరింపుల కేసులు
కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రక్షించడానికి ప్రాణాలకు తెగించి దూకి, ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్న ఒక డెలివరీ బాయ్.. ఇప్పుడు వసూళ్ల దందా (Extortion) కేసులో అరెస్ట్ అయ్యాడు. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ పోలీసులు.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న మోనిందర్ (26) తో పాటు అతడి సోదరుడు నరేంద్రను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాడు హీరోగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి.. నేడు క్రిమినల్ కేసులో అరెస్ట్ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోనిందర్, నరేంద్ర అనే ఇద్దరు అన్నదమ్ములు గ్రేటర్ నోయిడా సెక్టార్ 150 పరిసర ప్రాంతాల్లోని చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. తమ ప్రాంతంలో వ్యాపారం చేసుకోవాలంటే నెల నెలా రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు 'ప్రొటెక్షన్ మనీ' (మామూళ్లు) ఇవ్వాలని, లేదంటే వ్యాపారాలు సాగనివ్వబోమని బెదిరింపులకు గురిచేశారు. ఓ రెస్టారెంట్ యజమాని ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అన్నదమ్ముల దందా బయటపడింది.

పాత నేరాల చరిత్ర.. గూండా యాక్ట్
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి బ్యాక్‌గ్రౌండ్ పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వీరిద్దరిపై 2024 లోనే భౌతిక దాడులు, క్రిమినల్ బెదిరింపుల కేసులు నమోదయ్యాయి. అలాగే 2025 లోనూ మరికొన్ని కేసులు ఉండటంతో, గత ఏడాదే వీరిపై స్థానిక యంత్రాంగం 'గూండా యాక్ట్' (Goonda Act) కింద చర్యలు కూడా ప్రారంభించింది. ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి స్థానిక వ్యాపారులలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

గతంలో ఐటీ ఉద్యోగిని రక్షించే ప్రయత్నంతో వెలుగులోకి
ఈ ఏడాది జనవరి 16-17 తేదీల మధ్య రాత్రి సమయంలో గ్రేటర్ నోయిడాలో దట్టమైన పొగమంచు కారణంగా ఐటీ ప్రొఫెషనల్ యువరాజ్ మెహతా (27) ప్రయాణిస్తున్న కారు నియంత్రణ తప్పి.. నిర్మాణంలో ఉన్న ఒక 30 అడుగుల లోతు నీటి గుంతలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మోనిందర్.. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కాపాడటానికి ప్రాణాలకు తెగించి ఆ నీటి గుంతలోకి దూకాడు. అయితే దురదృష్టవశాత్తు యువరాజ్ మెహతా ఆ ప్రమాదంలో మరణించాడు. అప్పట్లో మోనిందర్ చేసిన రక్షణ ప్రయత్నాన్ని మీడియా, ప్రజలు ఎంతగానో అభినందించారు. కానీ, ఇప్పుడు అదే వ్యక్తి చిన్న వ్యాపారులను వేధిస్తూ అరెస్ట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Go Back to Shorts
Moninder
Greater Noida delivery boy arrest
Extortion case Greater Noida
Flipkart delivery boy arrested
Moninder and Narendra arrest
Greater Noida police

More Telugu News