30 ఏళ్ల నాటి వీరప్పన్ కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం
- నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీకి హైకోర్టు ఆదేశం
- వీరప్పన్ చేసిన పరువునష్టం కలిగించే ఆరోపణలను ప్రసారం చేసినందుకు ఈ తీర్పు
- దాదాపు 30 ఏళ్ల క్రితం 1996లో ప్రసారమైన ఇంటర్వ్యూపై సుదీర్ఘ న్యాయపోరాటం
- వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించకుండా ప్రసారం చేయడం సన్ టీవీ తప్పేనన్న కోర్టు
- దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించిన మద్రాస్ హైకోర్టు
అసలేంటి వివాదం?
1996 ఏప్రిల్ 17న సన్ టీవీలో ప్రసారమైన 'నేరుక్కు నేర్' అనే కార్యక్రమంలో ఈ వివాదం మొదలైంది. తమిళ పత్రిక 'నక్కీరన్' ఎడిటర్ ఆర్.ఆర్. గోపాల్.. వీరప్పన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరప్పన్.. నటి సుకన్యకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడితో అక్రమ సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేశాడు. 1996 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుకన్యకు సంబంధించిన కొన్ని వీడియోలను ఉపయోగించుకున్నారని కూడా వ్యాఖ్యానించాడు.
వీరప్పన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఇవి సమాజంలో తన గౌరవానికి, కీర్తి ప్రతిష్ఠలకు తీవ్ర నష్టం కలిగించాయని సుకన్య కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు తనను మానసికంగా కుంగదీశాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, రూ.10,00,500 నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. దీనిపై సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసింది.
తాజాగా ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ కె. కుమరేశ్ బాబు నేతృత్వంలోని ధర్మాసనం, సన్ టీవీ వాదనలను తోసిపుచ్చింది. ఇంటర్వ్యూను ప్రసారం చేసే ముందు దానిలోని అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ధ్రువీకరించుకోవడంలో, వాటిని తొలగించడంలో బ్రాడ్‌కాస్టర్ విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది. కార్యక్రమంపై పూర్తి ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పటికీ, వివాదాస్పద కంటెంట్‌ను ఎడిట్ చేయకుండా ప్రసారం చేయడం తప్పేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ, సుకన్యకు నష్టపరిహారం చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది.
సుకన్య 1980, 90వ దశకాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి, దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.