వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం
- 15 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చిన యువ సంచలనం వైభవ్
- ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు అనుమతి
- వారి ప్రయాణ ఖర్చులన్నీ బీసీసీఐయే భరిస్తుందని ప్రకటన
స్పోర్ట్‌స్టార్ కథనం ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని, కొత్త వాతావరణాన్ని తట్టుకుని నిలబడటానికి కుటుంబ సభ్యుల తోడు అతనికి ఎంతో సహాయపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. "అతను ఇంకా చిన్నపిల్లవాడు కావడంతో కొత్త వాతావరణంలో సులభంగా సర్దుకుపోవడానికి అతని తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాం. వారి ప్రయాణ ఖర్చులన్నీ బోర్డే భరిస్తుంది" అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం వైభవ్, ట్రై-నేషన్ సిరీస్ కోసం ఇండియా-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నీలో మొత్తం 776 పరుగులు సాధించి, టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేగాక 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనే అతనికి ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడల కోసం టీమిండియా టీ20 జట్టులో చోటు కల్పించింది.
వైభవ్ తనను తానే ఎంపిక చేసుకున్నాడు: చీఫ్ సెలక్టర్ అగార్కర్
ఈ యువ ఆటగాడి ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "వైభవ్ తన ప్రదర్శనతో తనను తానే జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు. అతని గురించి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేఆఫ్స్‌లో దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించాడు. అంత పోటీ, ఒత్తిడి ఉండే ఐపీఎల్‌లో ఒక యువ ఆటగాడు ఈ స్థాయిలో రాణించడం అసాధారణం. అతను మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడు. అందుకే అతనిపై మాకు భారీ అంచనాలు ఉన్నాయి" అని అగార్కర్ స్పష్టం చేశాడు.