అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం.. టాస్మాక్ అక్రమ వసూళ్లకు తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే చెక్!

Vijay cracks down on corruption and checks TASMAC illegal collections in first cabinet meeting
  • 'టాస్మాక్'పై విజయ్ కీలక నిర్ణయం 
  • మద్యం అమ్మకాల్లో లీకేజీలు, అనధికారిక 'పార్టీ ఫండ్' వసూళ్లను తక్షణమే అడ్డుకోవాలని ఆదేశం
  • ఈ అక్రమ వసూళ్ల ద్వారా నెలకు రూ. 102 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి 
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్ తన మార్క్ పాలనను ప్రారంభించారు. శుక్రవారం జరిగిన తన తొలి క్యాబినెట్ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వ మద్యం విక్రయాల సంస్థ 'టాస్మాక్' (TASMAC) ప్రక్షాళనపై ఆయన ఉక్కుపాదం మోపారు. టాస్మాక్ హోల్‌సేల్, రవాణా, రిటైల్ విక్రయాలలో జరుగుతున్న భారీ నిధుల మళ్లింపును, అనధికారిక 'పార్టీ ఫండ్' వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు.

సమావేశంలో ఉన్నతాధికారులు సీఎం విజయ్‌కు సమర్పించిన నివేదికల ప్రకారం.. టాస్మాక్ సరఫరా వ్యవస్థలో నెలకు సుమారు రూ. 102 కోట్ల మేర అనధికారిక వసూళ్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ లెక్కన గత ఐదేళ్లలో దాదాపు రూ. 1,600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కాకుండా పక్కదారి పట్టినట్లు అంచనా వేస్తున్నారు. మద్యం తయారీదారుల నుంచి రిటైల్ దుకాణాల వరకు ప్రతి లిక్కర్ కేస్‌పై రూ. 90, బీర్ కేస్‌పై రూ. 40, వైన్ కేస్‌పై రూ. 20 చొప్పున ఈ అక్రమ వసూళ్ల నెట్‌వర్క్ నడుస్తోంది. దీనితో పాటు వివాదాస్పదంగా మారిన 'రూ. 10 ఖాళీ సీసాల డిపాజిట్ స్కీమ్'లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని గుర్తించారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు జూన్ చివరి నాటికి డిపాజిట్ మొత్తాన్ని నేరుగా ఎంఆర్‌పీ (MRP) లో కలపడం లేదా డిజిటల్ రీఫండ్స్ ప్రవేశపెట్టడం వంటి సంస్కరణలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఆదాయం పోయినా పర్లేదు
ఎన్నికల హామీల్లో భాగంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం షాపులను మూసివేయాలని సీఎం విజయ్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 8,000 కోట్ల ఆదాయం తగ్గనుంది. అయినప్పటికీ, ఆ నష్టాన్ని పూడ్చడానికి మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని క్యాబినెట్ స్పష్టం చేసింది.

ఈ సంస్కరణలపై మద్య నిషేధం, అబ్కారీ శాఖ మంత్రి కె. విగ్నేష్ మాట్లాడుతూ.. "అవినీతి ద్వారా లేదా ప్రజల బాధల ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. లీకేజీలను తక్షణమే అరికట్టి, ప్రజల సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేర్చడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు. 'మద్య రహిత తమిళనాడు' లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రక్షాళనలో టాస్మాక్ తర్వాత మైనింగ్ శాఖలోని అక్రమాలపై సీఎం విజయ్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఈ తొలి క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల హామీలకు సంబంధించిన 436 పథకాలపై కూడా మంత్రుల బృందం సమగ్ర సమీక్ష నిర్వహించింది.
Go Back to Shorts
Vijay
Tamilaga Vettri Kazhagam
TASMAC corruption
Tamil Nadu Cabinet Meeting
CM Vijay reforms
TASMAC illegal collections
K Vignesh
Liquor shop closure
Tamil Nadu revenue leakage
TVK government

More Telugu News