అది నా నిర్ణయం కాదు.. ఐపీఎల్‌కు దూరం కావడంపై బాంబు పేల్చిన ఆర్‌సీబీ పేసర్!
- ఐపీఎల్ నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదన్న యశ్ దయాల్
- ఈ నిర్ణయం ఆర్‌సీబీ యాజమాన్యమే తీసుకుందని సంచలన ఆరోపణ
- తనను జట్టు నుంచి తొలగించలేదని, రీటెయిన్ జాబితాలో ఉంచారని వెల్లడి
- లైంగిక ఆరోపణల కేసుల కారణంగానే దయాల్ ఆటకు దూరమైనట్లు సమాచారం
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన యశ్ దయాల్, తన గైర్హాజరీకి గల కారణాలను వివరించాడు. "నేను జట్టును చాలా మిస్ అవుతున్నాను. టీవీలో వాళ్లు ఆడుతుంటే చూడలేకపోతున్నాను. అయితే నన్ను జట్టు నుంచి తొలగించలేదు, రీటెయిన్ జాబితాలోనే ఉంచారు. నా స్థానంలో మరొకరిని తీసుకోలేదు. నేను జట్టుకు ముఖ్యమైన ఆటగాడినని వాళ్లు భావిస్తున్నారేమో. ఈ సీజన్ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం కాదు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావొచ్చు, కానీ నిర్ణయం ఎప్పుడూ యాజమాన్యానిదే. ఆర్‌సీబీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు" అని దయాల్ పేర్కొన్నాడు.
అదే సమయంలో ఆర్‌సీబీ యాజమాన్యంతో తాను నిరంతరం టచ్‌లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. "నేను మేనేజ్‌మెంట్‌తో, డైరెక్టర్, కోచ్, దినేశ్ కార్తీక్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అంతా స్పష్టంగానే ఉంది" అని తెలిపాడు.
కాగా, యశ్ దయాల్ ప్రస్తుతం తీవ్రమైన లైంగిక ఆరోపణలు, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను ఎదుర్కొంటున్నాడు. ఈ న్యాయపరమైన చిక్కుల కారణంగానే అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.