'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా?
- 'పెద్ది' ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా ధోనీ హాజరయ్యే అవకాశం
- ముంబైలో మే 18న జరగనున్న గ్రాండ్ ఈవెంట్
- స్పోర్ట్స్ డ్రామా కావడంతో ధోనీని ఆహ్వానిస్తున్న చిత్రబృందం
- బాలీవుడ్ స్టార్లకు బదులుగా క్రికెటర్‌తో వినూత్న ప్రచార వ్యూహం
- దేశవ్యాప్తంగా 8 నగరాల్లో భారీ ప్రమోషన్లకు సన్నాహాలు
గ్రామీణ నేపథ్యంలో నడిచే ఒక స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మూవీ. అందుకే ఈ సినిమా స్ఫూర్తికి ధోనీయే సరైన వ్యక్తి అని, ఆయన హాజరైతే సినిమాకు దేశవ్యాప్తంగా భారీ మైలేజ్ వస్తుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో క్రికెట్, రెజ్లింగ్ వంటి క్రీడలకు ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే టీజర్లలో ఈ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఒకే వేదికపై రామ్ చరణ్, ఎంఎస్ ధోనీ కనిపించడం ఇటు సినీ అభిమానులకు, అటు క్రికెట్ ప్రేమికులకు కనుల పండుగ అవుతుంది. ఇక, మూవీలోని ఈ పాత్ర కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా క్రికెట్, రెజ్లింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఒక క్రీడాకారుడిగా చరణ్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో ధోనీ రాక సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుందని అంచనా వేస్తున్నారు.
కేవలం ఈవెంట్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మే 18 నుంచి జూన్ 2 మధ్య ముంబై, భోపాల్, బెంగళూరు సహా మొత్తం 8 ప్రధాన నగరాల్లో ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ ప్రమోషన్ల కోసం రామ్ చరణ్ విస్తృతంగా పర్యటించనున్నారు. త్వరలోనే ధోనీ రాకపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.