రాణించిన ప్రభ్‌సిమ్రన్, ఒమర్జాయ్... సరిగ్గా 200 పరుగులు చేసిన పంజాబ్
- ముంబై ఇండియన్స్‌కు 201 పరుగుల లక్ష్యం నిర్దేశించిన పంజాబ్ కింగ్స్
- హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్
- ముంబై బౌలర్లలో నాలుగు వికెట్లతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్
- చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అజ్మతుల్లా ఒమర్జాయ్
- శార్దూల్ దెబ్బకు తడబడినా.. చివరికి భారీ స్కోరు సాధించిన పంజాబ్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబైకి పంజాబ్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, ప్రభ్‌సిమ్రన్ ఔటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. శార్దూల్ ఠాకూర్ తన ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. దీంతో పంజాబ్ 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. అతనికి తోడుగా విష్ణు వినోద్ (15*), జేవియర్ బార్ట్‌లెట్ (18*) కూడా చివరి ఓవర్లలో విలువైన పరుగులు జోడించడంతో పంజాబ్ 200 పరుగుల మార్కును అందుకుంది. ముంబై బౌలర్లలో శార్దూల్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు. ముంబై ఇండియన్స్ ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.