శాంసంగ్ వినూత్న పంథా.. పాత వాటిని కొత్తగా చేసి అమ్ముతారట!
- భారత్‌లో 'సర్టిఫైడ్ రిఫర్బిష్డ్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్
- తక్కువ ధరలకే ప్రీమియం, మిడ్-రేంజ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు
- ప్రతి ఫోన్‌పై ఏడాది పాటు కంపెనీ వారంటీ అందిస్తున్న సంస్థ
- ఒరిజినల్ విడిభాగాలతో ఫోన్లను పునరుద్ధరించి విక్రయం
- మే 6 నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటు
ఈ కార్యక్రమం ద్వారా నాణ్యత, పనితీరు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభూతిని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని శాంసంగ్ ఇండియా తెలిపింది. రిఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్‌లో వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించడం, పర్యావరణ హితమైన ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని పేర్కొంది.
శాంసంగ్ ఇండియా డీ2సీ బిజినెస్ హెడ్ సుమిత్ వాలియా మాట్లాడుతూ, "నాణ్యత, విశ్వసనీయత విషయంలో శాంసంగ్ గెలాక్సీ పరికరాలపై వినియోగదారులు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ, మా టెక్నాలజీని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాం. 'సర్టిఫైడ్ రీ-న్యూడ్' ప్రోగ్రామ్ ఈ దిశగా వేసిన కీలక అడుగు" అని వివరించారు.
'సర్టిఫైడ్ రిఫర్బిష్డ్' కింద విక్రయించే ప్రతి ఫోన్‌ను శాంసంగ్ నిపుణులు సమగ్రంగా తనిఖీ చేస్తారు. కేవలం ఒరిజినల్ శాంసంగ్ విడిభాగాలను మాత్రమే ఉపయోగించి వాటిని కొత్తవాటిలా మారుస్తారు. ఫోన్‌లోని పాత డేటాను పూర్తిగా తొలగించి, తాజా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి, కొత్త బాక్సులో ప్యాక్ చేసి అందిస్తారు. ఈ ఫోన్లు మే 6 నుంచి శాంసంగ్.కామ్, శాంసంగ్ షాప్ యాప్‌లలో దేశవ్యాప్తంగా కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.