విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు
- తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు విజయ్
- యువతకు, నిపుణులకు విజయ్ పెద్దపీట
- కొత్త మంత్రులతో కొలువుదీరిన తొలి మంత్రివర్గం
- ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి సీనియర్ నేతల వరకు అవకాశం
- మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు దక్కని చోటు, అందరూ టీవీకే నేతలే
విజయ్ మంత్రివర్గంలో 29 ఏళ్ల నటి ఎస్. కీర్తనకు చోటు దక్కడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శివకాశి నుంచి గెలిచిన ఆమె, కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. పార్టీ ఆవిర్భావానికి ముందు విజయ్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండి, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్. ఆనంద్‌కు మంత్రివర్గంలో కీలక స్థానం లభించింది. అలాగే గతంలో డీఎంకే గెలుపులో వ్యూహకర్తగా పనిచేసిన బాస్కెట్‌బాల్ మాజీ క్రీడాకారుడు ఆధవ్ అర్జున, మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్, దంత వైద్యులు డాక్టర్ టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఐదు దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో పనిచేసి, గతేడాది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి విజయ్‌తో చేరిన సీనియర్ నేత సెంగొట్టైయన్‌కు కేబినెట్‌లో బెర్త్ దక్కింది. విజయ్‌కు సుదీర్ఘకాలంగా మేనేజర్‌గా ఉన్న అడ్వకేట్ పి. వెంకటరమణన్, పార్టీ ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ సైతం మంత్రులయ్యారు. విజయ్ ప్రకటించిన తొలి జాబితాలోని వారంతా 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.