వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు
- మే 10-12 మధ్య నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్
- జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటన
- జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ
దీంతో యూపీలోని గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌కు ఆమె దూరంగా ఉండనుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, రిటైర్మెంట్ తర్వాత తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆరు నెలల నోటీస్ వ్యవధిని పూర్తి చేయడంలో వినేశ్ ఫొగాట్ విఫలమైనట్లు డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. వినేశ్ ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని, దేశం అవమానపడేలా ఆమె వ్యవహరించారని పేర్కొంది.
జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హురాలిగా వేటుపటడంతో పాటు నాలుగు ప్రధాన ఆరోపణలపై వినేశ్ నుంచి వివరణ కోరింది.
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సొంత ఊరిలో పోటీలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో పోటీపడటం తనను మానసిక ఒత్తిడి గురిచేస్తోందని వినేశ్ ఫొగాట్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళల్లో తాను కూడా ఉన్నానని చెప్పిన వినేశ్ ఫొగాట్... పోటీల సందర్భంగా తనకు లేదా తన జట్టు సభ్యులకు ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని హెచ్చరించింది. అయితే పోటీల ప్రారంభానికి ఒకరోజు ముందు డబ్ల్యూఎఫ్ఐ నుంచి ఈ ప్రకటన వచ్చింది.