ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ ప్రయత్నాలు.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఆ పార్టీతోనూ సంప్రదింపులు!
- చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న టీవీకే
- దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే ఎమ్మెల్యేను సంప్రదించిన టీవీకే
- మన్నార్‌గుడి నుంచి విజయం సాధించిన కామరాజ్ ఎస్
ఈ క్రమంలో టీవీకే పార్టీ దాదాపు అన్ని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్రకళగం (ఏఎంఎంకే) తరఫున మన్నార్‌గుడి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
మరోవైపు, టీవీకేకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చేది లేదని అన్నాడీఎంకే స్పష్టమైన ప్రకటన చేసింది. డీఎంకే ప్రతిపక్షంలో కూర్చుంటామని తెలిపింది. అయితే విజయ్‌కు మద్దతిచ్చే అంశంలో తమ కూటమిలోని చిన్న పార్టీలకు డీఎంకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5, పీఎంకే 4, ఐయూఎంఎల్, సీపీఐ, వీసీకే, సీపీఐ(ఎం) పార్టీలు 2 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. బీజేపీ, డీఎండీకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఒక్కో సీటును గెలుచుకున్నాయి. పీఎంకే, వీసీకే, వామపక్షాలు విజయ్‌కు మద్దతుపై రేపు నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రమంలో అమ్మ మక్కల్ మున్నేట్రకజగం ఎమ్మెల్యేను టీవీకే సంప్రదించిందని తెలుస్తోంది.