ప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రకారం ప్రతిపక్షంలో కూర్చుంటాం: స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
- బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామన్న స్టాలిన్
- అధికారం కోసం డీఎంకే అడ్డదారులు తొక్కదని వ్యాఖ్య
- ఎమ్మెల్యేలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశం
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా, పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు మద్దతిచ్చే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఐక్యత ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.
తమిళనాడు అభివృద్ధిని కాంక్షించే వారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యాంగ సంక్షోభానికి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదని అన్నారు. డీఎంకే ఎప్పుడూ ప్రజల వైపు ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా... డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ పార్టీకి ఇంకా ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉండడంతో... డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేతులు కలిపి, వారి మిత్ర పక్షాలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.