విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్
- తమిళనాడులో విజయ్ గెలుపుపై మంత్రి వివేక్ వ్యాఖ్యలు
- సోషల్ మీడియా రీల్స్ కూడా విజయ్ గెలుపునకు కారణమన్న వివేక్
- యువ నాటకోత్సవాల వేదికగా ఆసక్తికర విశ్లేషణ
- కళలకున్న శక్తికి విజయ్ గెలుపే నిదర్శనమని వెల్లడి
- పాఠశాలల్లో సంగీతం, నాట్యం కోర్సులుండాలని సూచన
హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో 'యువ నాటకోత్సవాలు' ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కళలకు ఎంతో శక్తి ఉందని, అందుకు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయమే నిదర్శనమని అన్నారు. వినూత్నంగా ఆలోచిస్తే విజయం తథ్యమని, సోషల్ మీడియా ప్రభావం ఆ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. కళారంగం, నాటక రంగంలోకి యువతరం రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని అధికారానికి చేరువైంది. 2024లో పార్టీని స్థాపించిన రెండేళ్లకే విజయ్ ఈ ఘనత సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో కళలను ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయి నుంచే సంగీతం, నాట్యం, నాటకం వంటి అంశాల్లో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ సూచించారు.