నేను డబ్బు మనిషిని కాదు .. ఇష్టం లేని పని చేయను: ఎల్బీ శ్రీరామ్
- నటుడిగా 500లకి పైగా సినిమాలు
- రొటీన్ పాత్రలే వస్తున్నాయని ఆవేదన
- అందుకే సినిమాలు తగ్గించానని వెల్లడి
- తనలో తపన ఇంకా తగ్గలేదని వ్యాఖ్య
"రచయితగా నా స్పీడ్ చూసి మా ఇంట్లో వాళ్లే చాలా కంగారు పడ్డారు. మున్ముందు వచ్చే సినిమాలకు ఏం రాస్తాడు? అని మా పెద్దన్నయ్య వాళ్లు టెన్షన్ పడేవాళ్లు. నేను మాత్రం అదే తపనతో దూసుకుపోయేవాడిని. నటుడిగా 500 సినిమాలు చేసి ఉంటాను. ఆ తరువాత ఎక్కువగా తెరపై కనిపించడం లేదు. నటుడు తెరపై కనిపిస్తూ ఉంటేనే ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు కనిపించడం కాలేదని ఆలోచన చేసేంత తీరిక ఎవరికీ ఉండక పోవచ్చు. అందుకే షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్నాను" అని అన్నారు.
"దర్శకుడిగా .. నిర్మాతగా నాదైన దారిలో కష్టపడుతున్నాను. నటుడిగా ఒకే విధమైన పాత్రలు వస్తున్నాయి. రొటీన్ గా అలాంటి పాత్రలే చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని కోటి రూపాయలు ఇచ్చినా చేయను. డబ్బు కోసం మాత్రమే వేషాలు వేయడానికి నేను డబ్బు మనిషిని కాదు .. కళాకారుడిని. అన్నిరకాల పాత్రలు చేయాలని ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకపోవడం వలన, నా మనసుకు నచ్చిన దారిలో వెళుతున్నాను" అని చెప్పారు.