వైభవ్ సూర్యవంశీ ఆట చైల్డ్ లేబర్ కిందకు వస్తుందట... అతడ్ని ఐపీఎల్ నుంచి తొలగించాలట!
- ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని ఆడించడం బాల కార్మిక చట్టం ఉల్లంఘనేనని ఆరోపణ
- 15 ఏళ్ల వైభవ్‌ను జట్టు నుంచి తొలగించాలని రాజస్థాన్ రాయల్స్‌ను డిమాండ్ చేసిన కార్యకర్త
- క్రీడలు, వినోద రంగానికి బాల కార్మిక చట్టం నుంచి కొన్ని మినహాయింపులు
- ఆరోపణలపై అధికారికంగా స్పందించని రాజస్థాన్ రాయల్స్, బీసీసీఐ
ఓ కన్నడ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న సదరు కార్యకర్త ఈ వ్యాఖ్యలు చేశారు. "చదువుకోవాల్సిన వయసులో 15 ఏళ్ల పిల్లాడితో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడించడం సరికాదు. ఇది బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే. రాజస్థాన్ రాయల్స్ వెంటనే అతడిని జట్టు నుంచి తొలగించాలి, లేకపోతే నేను కేసు ఫైల్ చేస్తాను" అని ఆయన హెచ్చరించారు.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లకు రాజస్థాన్ జట్టులోకి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో తన అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, భారత చట్టాల ప్రకారం 14-18 ఏళ్ల మధ్య వయసున్న వారిని 'అడోలెసెంట్స్'గా పరిగణిస్తారు. ప్రమాదకరం కాని క్రీడలు, వినోద రంగాల్లో కొన్ని షరతులతో పనిచేయడానికి అనుమతి ఉంది. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగానే వైభవ్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.
ప్రస్తుతం ఈ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గానీ, బీసీసీఐ గానీ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ సదరు కార్యకర్త ఫిర్యాదు చేస్తే ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.