చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం
- పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్
- ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
- 29 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేసిన వైనం
శ్రీలంకలోని తలైమన్నార్ వద్ద శుక్రవారం ఉదయం 4 గంటలకు తన ఈతను ప్రారంభించిన ఇషాంక్ బలమైన సముద్ర ప్రవాహాలు, అలలను అధిగమించి మధ్యాహ్నం 1:50 గంటలకు తమిళనాడులోని ధనుష్కోడి సమీపంలోని అరిచల్మునై తీరానికి చేరుకున్నాడు. తీరానికి చేరుకున్న ఇషాంక్కు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ విజయంతో 2019లో 10 ఏళ్ల వయసులో 10 గంటల 30 నిమిషాల్లో పాక్ జలసంధిని ఈదిన తమిళనాడుకు చెందిన జై జశ్వంత్ రికార్డును ఇషాంక్ బద్దలు కొట్టాడు. ఇషాంక్ విజయంపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్ ద్వారా ప్రశంసలు కురిపించారు. "ఇషాంక్ అసాధారణ ప్రతిభావంతుడు. అతడి క్రమశిక్షణ, అంకితభావం ఝార్ఖండ్కే కాకుండా దేశం మొత్తానికే గర్వకారణం" అని ఆయన పేర్కొన్నారు.