వ్యోమగాముల వింత సమస్య..స్పేస్ నుంచి తిరిగొచ్చాక చేతి నుంచి వస్తువులు ఎందుకు జారిపోతాయి?
- అంతరిక్షం నుంచి వచ్చాక వస్తువులు పట్టుకోవడంలో వ్యోమగాముల ఇబ్బందులు
- గురుత్వాకర్షణ శక్తిని మెదడు తేలికగా మర్చిపోదని తేల్చిన పరిశోధన
- అంతరిక్షంలో వస్తువులను అవసరం కంటే గట్టిగా పట్టుకుంటున్న వ్యోమగాములు
- భూమికి తిరిగొచ్చాక పట్టుకు కావాల్సిన బలాన్ని అంచనా వేయడంలో విఫలం
- దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం జేన్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితం
బెల్జియంకు చెందిన లూవైన్ విశ్వవిద్యాలయం, స్పెయిన్‌కు చెందిన ఐకర్‌బాస్క్ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం వివరాలను 'జేన్యూరోసైన్స్' (JNeurosci) జర్నల్‌లో ప్రచురించారు. వారి ప్రకారం, వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు వారి మెదడు భూమి గురుత్వాకర్షణ శక్తిని మర్చిపోదు. దాని జ్ఞాపకాలను నెలల తరబడి పదిలంగా ఉంచుకుంటుంది. దీంతో అంతరిక్షంలో వస్తువులు కింద పడవని తెలిసినా, భూమిపై ఉన్నట్లే ఊహించుకుని వాటిని అవసరం కంటే చాలా గట్టిగా పట్టుకుంటారు.
అదే వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చాక పరిస్థితి తారుమారవుతుంది. అంతరిక్షంలోని తేలికైన వాతావరణానికి పాక్షికంగా అలవాటుపడిన మెదడు.. భూమిపై ఒక వస్తువును పట్టుకోవడానికి ఎంత బలం ప్రయోగించాలో సరిగ్గా అంచనా వేయలేదు. ఫలితంగా కొన్నిసార్లు వస్తువులను చేతి నుంచి జారవిడిచే ప్రమాదం ఉంటుంది. క్రమంగా మెదడు తిరిగి భూ వాతావరణానికి అలవాటు పడుతుంది కానీ, ఈ మార్పు వెంటనే జరగదు.
ఒక వస్తువు కింద పడిపోతుందనే ప్రమాదాన్ని మెదడు ఎలా అంచనా వేస్తుందనే దానిపైనే చేతి పట్టు నియంత్రణ ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అంతరిక్ష పరిశోధనా సంస్థలతో సమన్వయం, డేటా విశ్లేషణ వంటి కారణాలతో ఈ అధ్యయనాన్ని పూర్తి చేయడానికి దాదాపు 20 ఏళ్లు పట్టిందంటే, స్పేస్ న్యూరోసైన్స్ పరిశోధన ఎంత సంక్లిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు.