తమ్ముడు హార్దిక్‌తో గొడవలా?.. కృనాల్ పాండ్యా ఏం చెప్పాడంటే..!
- తమ్ముడు హార్దిక్ పాండ్యాతో ఎలాంటి గొడవలు లేవన్న కృనాల్ పాండ్యా
- అదంతా కేవలం పుకార్లేనని, తమ మధ్య అంతా బాగానే ఉందని వెల్లడి
- లక్నో యువ ఆటగాడిని స్లెడ్జింగ్ చేయలేదని, సరదాగా మాట్లాడానని వివరణ
- ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాండ్యా బ్రదర్
- తిరిగి టీమిండియాలోకి రావడమే తన లక్ష్యమని పేర్కొన్న ఆల్‌రౌండర్
ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ డానిశ్ సైత్‌తో కృనాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా డానిశ్ సరదాగా.. "మీకు, హార్దిక్‌కు మధ్య అంతా ఓకేనా? లేక ఏమైనా గొడవలు ఉన్నాయా?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కృనాల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. డానిశ్ జోక్యం చేసుకుని, "కొన్నిసార్లు కేన్, అండర్‌టేకర్ కూడా గొడవపడతారు" అని వ్యాఖ్యానించగా, మరోసారి "అంతా ఓకేనా?" అని అడిగారు. దీనికి కృనాల్ పాండ్యా.. "అంతా ఓకే" అని స్పష్టంగా బదులిచ్చాడు. దీంతో పాండ్యా బ్రదర్స్ మధ్య గొడవలున్నాయనే ప్రచారానికి తెరపడినట్లయింది.
ఇదే ఇంటర్వ్యూలో లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరిని తాను స్లెడ్జింగ్ చేశాననే ఆరోపణలపైనా కృనాల్ వివరణ ఇచ్చాడు. "నేను అతడిని స్లెడ్జింగ్ చేయలేదు. మొదటి బంతికే ప్యాడిల్ షాట్ ఆడాడు. నేను కేవలం, ‘ముకుల్ నువ్వు యువ ఆటగాడివి. లాంగ్-ఆన్ లేదా లాంగ్-ఆఫ్ మీదుగా సిక్సర్లు కొట్టగలవు. అక్కడ కొట్టు’ అని సరదాగా అన్నాను. నా హెయిర్‌స్టైల్ చూసి అందరూ నన్ను సీరియస్‌గా, కోపంగా ఉంటానని అనుకుంటారు. కానీ నేను అలా కాదు" అని కృనాల్ వివరించాడు.
ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ తరఫున కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా తన బౌలింగ్‌లో కొత్త నైపుణ్యాలను జోడించి, స్పిన్నర్ అయినప్పటికీ బౌన్సర్లు వేస్తూ బ్యాటర్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సీజన్‌లో నిలకడగా రాణించి, జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని కృనాల్ పేర్కొన్నాడు.