అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ
- ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే 'మావిగన్' నినాదం అన్న ఏబీ వెంకటేశ్వరరావు
- అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకున్నారని వ్యాఖ్య
- రూ.2 లక్షల కోట్ల ఖర్చుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్
విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే 'మావిగన్' వంటి వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పత్రికలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు" అని ఏబీవీ దుయ్యబట్టారు. జగన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు మద్దతు పలకడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని జగన్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఏబీవీ తెలిపారు. ఆ మొత్తం ఎలా ఖర్చవుతుందో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే, భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.