ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. అపస్మారక స్థితిలో మోజ్తబా ఖమేనీ!
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- పవిత్ర నగరం కోమ్‌లో రహస్యంగా అత్యవసర చికిత్స
- ఫిబ్రవరి దాడుల్లో గాయపడటమే కారణమని ఊహాగానాలు
ప్రస్తుతం ఆయనకు టెహ్రాన్‌కు బదులుగా పవిత్ర నగరమైన కోమ్‌లో అత్యంత రహస్యంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. భద్రతా కారణాలరీత్యా మోజ్తబాను అక్కడికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా మోజ్తబా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
గత ఫిబ్రవరిలో తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి కారణమైన వైమానిక దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆ గాయాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదని గూఢచార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గాయాల వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందని భావిస్తున్నారు.
అయితే, ఈ వార్తలను ఇరాన్ అధికారిక వర్గాలు ఇంతవరకు ధ్రువీకరించలేదు. మోజ్తబా క్షేమంగానే ఉన్నారని, యుద్ధ వాతావరణం కారణంగా ఓ రహస్య ప్రదేశం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న కీలక సమయంలో దేశ అత్యున్నత నేత ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలు ఇరాన్‌లో రాజకీయ అనిశ్చితికి దారితీస్తున్నాయి.