సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ
- కేరళలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
- సీఎం విజయన్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
- ఆయన పాలనలో అహంకారం కనిపిస్తోందని విమర్శ
- కేరళలో బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ
- మోదీని విమర్శిస్తే తనపై కేసులు, విజయన్‌పై ఎందుకు లేవని ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించినందుకు తనపై కేంద్ర ఏజెన్సీలు చర్యలు తీసుకున్నాయని, కానీ సీఎం విజయన్ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ నిలదీశారు. ఈ పరిణామం బీజేపీ, లెఫ్ట్ నేతల మధ్య ఉన్న రాజకీయ ఒప్పందాన్ని బలపరుస్తోందని పేర్కొన్నారు. కేరళ పర్యటనల్లో ప్రధాని మోదీ మతపరమైన అంశాలు మాట్లాడతారని, కానీ శబరిమల స్మగ్లింగ్ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. వామపక్షాలకు సహాయం చేసేందుకే మోదీ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా కేవలం విజయన్ ఫొటోలతో ఉన్న పోస్టర్లను ప్రస్తావిస్తూ, పాలన అంతా ఒక్కరే చేస్తున్నారనే అభిప్రాయాన్ని కల్పించడం రాజకీయ అహంకారమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ తరహా ఏకవ్యక్తి నాయకత్వం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల పాలనలో కనిపిస్తుందని అన్నారు.
కేరళలో పాలన సాగించేందుకు విజయన్ ఒక్కరే సమర్థుడని ప్రచారం చేసుకోవడం ప్రజలను అవమానించడమేనని రాహుల్ అన్నారు. వినయం, ప్రజల సానుభూతి ఉన్న ఎందరో నాయకులు రాష్ట్రంలో ఉన్నారని, ప్రజాస్వామ్య నాయకత్వానికి అణకువ అవసరమని హితవు పలికారు. కేరళలో అసలైన పోరాటం యూడీఎఫ్‌కు, బీజేపీ-ఎల్డీఎఫ్ కూటమికి మధ్యేనని ఆయన స్పష్టం చేశారు.