ఆర్సీబీలో 5వ ఓవర్సీస్ ప్లేయర్ మీరేనా?.. సోషల్ మీడియా జోక్‌పై కోహ్లీ ఫన్నీ రియాక్షన్!
- ఆర్సీబీలో ఐదో ఓవర్సీస్ ప్లేయర్ మీరేనన్న జోక్‌పై స్పందించిన కోహ్లీ
- తాను విదేశీ ఆటగాడిని కాదంటూ నవ్వుతూ సమాధానం
- తరచూ లండన్‌లో ఉంటుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన జోక్
- ఆర్సీబీ పోస్ట్ చేసిన వీడియోలో మిస్టర్ నాగ్స్‌తో ఫన్నీ సంభాషణ
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించే వీలుంది. అయితే, కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి ఎక్కువ సమయం లండన్‌లో గడుపుతుండటంతో.. అతడిని ఆర్సీబీ తరఫున ఆడుతున్న ఐదో 'ఓవర్సీస్ ప్లేయర్' అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా జోకులు వేస్తున్నారు. ఈ విషయంపై ఆర్సీబీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మిస్టర్ నాగ్స్, కోహ్లీని ప్రశ్నించాడు.
"ఈ సీజన్‌లో ఆర్సీబీ ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్లతో ఆడుతోందనే జోక్‌పై మీరేమంటారు?" అని మిస్టర్ నాగ్స్ అడగ్గా.. కోహ్లీ ఒక్కసారిగా నవ్వేశాడు. "నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయం ఓవర్సీస్ ప్లేయర్లను అడగండి. నేను ఓవర్సీస్ ప్లేయర్‌ని కాదు" అని ఫన్నీగా బదులిచ్చాడు. ఆ తర్వాత, "నేను ఓవర్సీస్ ప్లేయర్‌లా కనిపిస్తున్నానా?" అని ఎదురు ప్రశ్నించగా, లేదని హోస్ట్ సమాధానమిచ్చాడు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.