ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం
- మొలుక్కా సముద్రంలో 35 కి.మీ. లోతులో భూకంప కేంద్రం
- ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ హెచ్చరిక
- భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:48 గంటలకు మొలుక్కా సముద్రంలో టెర్నాటే ద్వీపానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్జీఎస్ గుర్తించింది. దీని ప్రభావంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
భూకంపం కారణంగా నార్త్ సులవేసి ప్రావిన్స్‌లోని మనాడో నగరంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడంతో నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమీపంలోని ఓ పాఠశాలలోని విద్యార్థులు కూడా భయంతో బయటకు వచ్చారు. చాలా సేపటి వరకు భూమి కంపించిందని, అయితే ప్రాథమికంగా ఎలాంటి ఆస్తి నష్టం కనిపించలేదని స్థానిక మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.