ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?
- ఎడమ చేతి నిండా సరికొత్త డిజైన్‌తో కనిపించిన స్టార్ బ్యాటర్
- కోహ్లీ జీవిత ప్రయాణాన్ని ఈ టాటూ ప్రతిబింబిస్తుందన్న ఆర్టిస్టులు
- పాత టాటూలను కవర్ చేస్తూ ఈ కొత్త డిజైన్‌ను పూర్తి చేసిన వైనం
- 'ఏలియన్స్ టాటూ ఇండియా' షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్
రేపటి నుంచి ఐపీఎల్ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలకమైన టోర్నీకి ముందు కోహ్లీ వేయించుకున్న ఈ టాటూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ టాటూ వెనుక ఉన్న అర్థాన్ని ఏలియన్స్ టాటూ సంస్థ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. "ఇది కేవలం మరో కొత్త టాటూ కాదు. కోహ్లీ వ్యక్తిగా ఎలా ఎదిగాడు, అతని ప్రయాణం ఏంటి అనే లోతైన అర్థాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అతని జీవితంలోని పరివర్తనకు ఇది అద్దం పడుతుంది" అని పేర్కొంది. జీవితంలోని ప్రతి దశలోనూ క్రమశిక్షణ, ఏకాగ్రత, అచంచలమైన నమ్మకంతో పాత అలవాట్లను, ఆలోచనలను వదిలేశాడని, కొన్నింటిని మరింత బలోపేతం చేసుకున్నాడని, మరిన్ని కొత్త నమ్మకాలను తన వ్యక్తిత్వంలో చేర్చుకున్నాడని తెలిపింది. వాటన్నిటికీ ఈ టాటూ ప్రతీక అని వివరించింది.
కోహ్లీ ఎడమ చేయి ఖాళీ కాన్వాస్ కాదని, దానిపై ఇప్పటికే వేర్వేరు దశలకు చెందిన పాత టాటూలు ఉన్నాయని ఆర్టిస్టులు తెలిపారు. వాటిలో కొన్ని కాలక్రమేణా స్పష్టత కోల్పోయాయని, మరికొన్ని ప్రస్తుత అతని వ్యక్తిత్వానికి సరిపోలడం లేదని అన్నారు. అందుకే కొన్ని పాత టాటూలను పూర్తిగా కవర్ చేస్తూ, మరికొన్నింటిని మెరుగుపరుస్తూ, కొత్త ఎలిమెంట్స్‌ను జోడించి ఒకే కథగా చెప్పేలా ఈ ఫుల్ స్లీవ్ టాటూను పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు. పాత, కొత్త టాటూల కలయికతో అతని జీవిత ప్రయాణాన్ని తెలిపేలా దీనిని తీర్చిదిద్దినట్లు వివరించారు.