దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!
- బంకులకు క్రెడిట్ సౌకర్యం రద్దు చేసిన ఆయిల్ కంపెనీలు
- నగదు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టీకరణ
- కంపెనీల ఈ కొత్త రూల్‌తో హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు
నగదు అడ్వాన్స్‌గా ఇస్తేనే ఇంధనం..
నిన్న మొన్నటి వరకు ఆయిల్ కంపెనీలు తమ రెగ్యులర్ కస్టమర్లు (బంకుల యాజమాన్యాలు, డీలర్లు) కు క్రెడిట్ సౌకర్యం కల్పించేవి. ముందుగా ఇంధనం పంపించి ఆ తర్వాత డబ్బు వసూలు చేసుకునేవి. ఇప్పటివరకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు డీలర్లకు 3 నుంచి 5 రోజుల క్రెడిట్ సౌకర్యం కల్పించేవి. దీనివల్ల డీలర్లు ఇంధనం తెప్పించుకున్న తర్వాత డబ్బు చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా కంపెనీలు ఈ క్రెడిట్ విధానాన్ని రద్దు చేశాయి. ఇకపై ఇంధనం కావాలంటే డీలర్లు ముందస్తుగానే నగదు చెల్లించాలని (అడ్వాన్స్ పేమెంట్) కొత్త నిబంధన విధించాయి.
నగదు చెల్లించలేక ఆర్డర్ చేయలేకపోతున్న డీలర్లు
ఈ మార్పుతో చాలా మంది డీలర్లు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేక ఇంధనం కోసం ఆర్డర్లు పెట్టలేకపోయారు. దీంతో వారి వద్ద ఉన్న నిల్వలు అయిపోగానే బంకులను మూసివేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో బంకులు మూతపడుతున్నాయనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ట్యాంకులు ఫుల్ చేసుకోవడంతో పాటు క్యాన్లలోనూ ఇంధనం నింపుకోవడానికి ఎగబడటంతో ఉన్నచోట్ల కూడా డిమాండ్ అమాంతం పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.
డీలర్లు, ఆయిల్ కంపెనీల మధ్యే సమస్య..
ఈ విషయంపై స్పందించిన పౌరసరఫరాల శాఖ అధికారులు, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది కేవలం డీలర్లు, కంపెనీల మధ్య చెల్లింపుల సమస్య మాత్రమేనని, ప్రజలు భయపడి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. సరఫరా త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు.