ధురంధర్-2 వివాదం... సారీ చెప్పిన మాధవన్
- 'ధురంధర్ 2' సినిమాలోని ఓ సీన్‌పై చెలరేగిన వివాదం
- సిగరెట్ చేతిలో ఉండగా గుర్బానీ పఠించడంపై సిక్కుల అభ్యంతరాలు
- ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్న నటుడు మాధవన్
- డైలాగ్ చెప్పే ముందే సిగరెట్ ఆర్పేశానని వివరణ
- చిత్రబృందంపై ముంబైలో పోలీస్ కంప్లైంట్ నమోదు
ఈ విషయంపై మాధవన్ వివరణ ఇస్తూ, "ఇది కేవలం అపార్థం మాత్రమే. ఆ సన్నివేశంలో పవిత్రమైన డైలాగ్ చెప్పడానికి చాలా ముందే నేను సిగరెట్‌ను పూర్తిగా ఆర్పివేశాను. ఈ విషయాల్లో నాకంటే మా దర్శకుడు ఆదిత్య ధర్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చేతిలో సిగరెట్ ఉండకూడదని, నోటి నుంచి పొగ రాకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు" అని తెలిపారు. సన్నివేశం ప్రారంభంలో తన చేతిలో సిగరెట్ ఉన్న మాట వాస్తవమే అయినా, డైలాగ్ చెప్పే సమయానికి అది లేదని ఆయన పేర్కొన్నారు.
సిక్కు సమాజంపై తమకు అపారమైన గౌరవం ఉందని మాధవన్ అన్నారు. "ప్రతి సినిమా విడుదలకు ముందు నేను గోల్డెన్ టెంపుల్‌కు వెళతానని అందరికీ తెలుసు. కాబట్టి మమ్మల్ని నమ్మండి, ఎవరినీ నొప్పించాలని మేము అనుకోలేదు" అని ఆయన వివరించారు.
కాగా, 'ధురంధర్ 2' చిత్రబృందం సిక్కు మత మనోభావాలను కించపరిచిందంటూ ముంబైలో పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో, తెలిసి గానీ, తెలియక గానీ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని మాధవన్ కోరారు.